
Bభారతదేశంలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతకు తోడ్పాటు
ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా వోకల్ ఫర్ లోకల్ మరియు ఆత్మనిర్భర్ కృషి లక్ష్యాలను సాధించే దిశగా ప్రయత్నాలు
నవంబర్ 6, 2020, న్యూఢిల్లీ: రైతాంగ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SBI YONO కృషి పోర్టల్‌తో తమ ఈ-కామర్స్ విభాగం www.iffcobazar.in,ను అనుసంధానించినట్లు IFFCO ప్రకటించింది. లక్షల మంది భారతీయ రైతులకు వివిధ వ్యవసాయ ఉత్పత్తులు విస్తృతంగా లభ్యమయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ విభాగంలో డిజిటల్ మాధ్యమం ద్వారా అమ్మకాలను మరింతగా పెంచే లక్ష్యంతో చెల్లింపుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండని SBI YONO పేమెంట్ పోర్టల్ మరియు IFFCO యొక్క నాణ్యమైన ఉత్పత్తుల మేళవింపుతో ఈ భాగస్వామ్యం ఏర్పాటైంది.
www.iffcobazar.in అనేది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఆధారిత ఈ-కామర్స్ పోర్టల్స్‌లో ఒకటి. దీన్ని దేశంలోనే అతి పెద్ద ఎరువుల తయారీ దిగ్గజం IFFCO ప్రమోట్ చేస్తోంది. ఈ పోర్టల్ 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారతదేశవ్యాప్తంగా ఉచిత హోమ్ డెలివరీ సేవలు అందిస్తోంది. అలాగే భారతదేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 1200+ పైగా స్టోర్స్ నిర్వహిస్తోంది. స్పెషాలిటీ ఎరువులు, సేంద్రియ వ్యవసాయ ముడి పదార్థాలు, విత్తనాలు, ఆగ్రోకెమికల్స్, వ్యవసాయ సంబంధ యంత్రాలు, పరికరాలు మొదలైన వివిధ రకాల ఉత్పత్తులు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.
భాగస్వామ్యంపై స్పందిస్తూ, “భారతదేశంలోనే అత్యంత పురాతన వ్యాపార సంస్థల్లో IFFCO మరియు SBI, ఈ రెండూ ఉంటాయి. మా సంస్థల పేర్లలో ఉన్న ‘I’ అక్షరం, ఇండియాను ప్రతిబింబిస్తుంది. ఇది ఇరు సంస్థలు సదా కలిసి ఉండేందుకు స్ఫూర్తిగా ఉంటుంది. తమ ఉమ్మడి సామర్థ్యాలతో, భారతీయ రైతాంగం జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు రెండు గొప్ప ‘భారతీయ’ సంస్థలు ఒక్కతాటిపైకి రావడం గర్వకారణంగా ఉంది” అని ఈ సందర్భంగా IFFCO ఎండీ Dr. U.S. అవస్థి తెలిపారు. “గత 50 ఏళ్లుగా దేశ రైతాంగానికి IFFCO సేవలు అందిస్తోంది. iffcobazar.in అనేది రైతులతో డిజిటల్‌గా అనుసంధానమయ్యేందుకు, వారికి సేవలు అందించేందుకు ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుంది. డిజిటల్ ఫస్ట్ మరియు రైతు ప్రయోజనాలే ప్రధానంగా ఉండే విధానాల ద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న మన గౌరవనీయ ప్రధాని ఆకాంక్షలను సాకారం చేసే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా రైతులు అత్యంత నాణ్యమైన సబ్సిడీయేతర ఎరువులను, ఇతర వ్యవసాయ ముడివస్తువులను ఆర్డరు చేయడంతో పాటు రైతుల ఫోరం, ప్రత్యేక హెల్ప్‌లైన్ ద్వారా తమ సందేహాలకు సమాధానాలను కూడా పొందవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. “ఆర్థిక సంస్థగా సేవలందించడంలో దేశంలో SBI ఎంతో ప్రశంసనీయంగా పనిచేస్తోంది. గ్రామీణ భారతంలో SBI విస్తరించిన తీరు అసమానమైనది. SBI YONO ద్వారా iffcobazar.in పోర్టల్ దేశవ్యాప్తంగా రైతులకు మరింత చేరువ కాగలదని నేను విశ్వసిస్తున్నాను” అని అవస్థి ధీమా వ్యక్తం చేశారు.
“డబ్బు మరియు ఎరువులు అనేవి రైతులకు అత్యంత కీలకమైన రెండు ముడి వస్తువులు. దేశీయంగా తమ తమ రంగాల్లో దిగ్గజాలైన రెండు భారతీయ సంస్థల్లో భాగమైన, SBI YONO మరియు iffcobazar.inలు, ఈ భాగస్వామ్యంతో అత్యంత నాణ్యమైన వ్యవసాయ ముడి వస్తువులను రైతుల ఇంటి ముంగిట్లోకే చేర్చవచ్చు” అని IFFCO మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ యోగేంద్ర కుమార్ తెలిపారు. అలాగే, “YONOలో రిజిస్టరయిన 3 కోట్ల మంది పైగా కస్టమర్లకు IFFCO BAZAR చేరువయ్యేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. వీరిలో అత్యధిక శాతం మంది రైతులే ఉన్నారు. ఒక విశ్వసనీయమైన వ్యవస్థను సృష్టించేందుకు గ్రామీణ భారతదేశంలో పటిష్టమైన బ్రాండ్లు తమ సామర్థ్యాలను ఉపయోగించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. అంతిమంగా రైతులకు ముడివస్తువుల వ్యయాలను తగ్గించగలదు” అని యోగేంద్ర కుమార్ పేర్కొన్నారు.
IFFCO గురించి
IFFCO అనేది ప్రపంచంలోనే అతి పెద్ద సహకార సంఘాల్లో ఒకటి. ఎరువుల తయారీ, విక్రయం, మరియు పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సహకార సంఘాల సారథ్యంలో ఇది పనిచేస్తోంది. 1967లో కేవలం 57 సహకార సంఘాలతో ఏర్పాటైన ఈ సంస్థలో ప్రస్తుతం 35,000 పైచిలుకు సహకార సంఘాలు ఉన్నాయి. సాధారణ బీమా మొదలుకుని ఫుడ్ ప్రాసెసింగ్ వరకూ వివిధ రంగాల్లోనూ, ఒమన్, జోర్డాన్, దుబాయ్ మరియు సెనెగల్ దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. దేశీయంగా అయిదు ఎరువులతయారీ ప్లాంట్లు, దేశవ్యాప్తంగా విస్తృతమైన మార్కెటింగ్ నెట్‌వర్క్ ఉంది. దేశీయంగా మార్కెటింగ్ చేసే ప్రతి మూడో ఫాస్ఫేట్ ఎరువుల బస్తా, ప్రతి అయిదో యూరియా బస్తా IFFCOనే హ్యాండిల్ చేస్తోంది. 2018-19లో IFFCO 8.14 మిలియన్ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేసింది. దాదాపు 11.55 మిలియన్ టన్నుల ఎరువులను రైతులకు విక్రయించింది. భారతీయ రైతాంగం మరియు వ్యవసాయ రంగ సమ్మిళిత, సమగ్రాభివృద్ధికి తోడ్పడేందుకే IFFCO ప్రధానంగా పనిచేస్తోంది. సమ్మిళిత వ్యాపార విధానం ఇందుకు దోహదపడుతోంది. ఈ దిశగా CORDET, IFFDC మరియు IKST వంటి అనేక అభివృద్ధి కారక చర్యలు చేపట్టింది.